Home భక్తి సమాచారం సీతాదేవికి అగ్ని పరీక్ష

సీతాదేవికి అగ్ని పరీక్ష

60
0

రావణ వధానంతరం సీతకు రాముడు అగ్నిపరీక్ష విధించాడు. కానీ అంతకు ముందే సీత రామునికి అగ్ని పరీక్ష విధించింది. సీతాన్వేషణకు లంకకు వెళ్ళిన హనుమంతుని ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధించి రావణుని సమక్షంలో నిలుపుతాడు.

హనుమంతునిపై కోపించిన రావణుడు అతని తోకకు నిప్పు పెట్టమని చెపుతాడు. రాక్షసులు హనుమ వాలమునకు నిప్పు పెడతారు. ఆ నిప్పుతోనే హనుమంతుడు లంకాదహనం చేస్తాడు.

ఆ సమయంలో అశోకవనంలో ఉన్న సీతాదేవి, “నా భర్త పరస్త్రీని కోరనివాడైతే, ధర్మస్వరూపుడే కనుక అయితే, నేను మనసా వాచా పరపురుషుని కోరని దాననైతే హనుమ వాలమున కాలుచున్న అగ్ని చల్లారును గాక అని సంకల్పించింది. హనుమంతుని తోక చల్లారింది.

అలా సీత పెట్టిన అగ్ని పరీక్షలో శ్రీరాముడు కూడా నిగ్గుతేలాడు. రామ కార్యార్థి కనుక ఆ అగ్ని హనుమంతుని ఏమీ చేయలేకపోయింది.

సీతాదేవికి అగ్ని పరీక్ష:

రావణవధానంతరం సీతాదేవికి అగ్నిపరీక్ష విధిస్తాడు శ్రీరాముడు. ఏం, సీతాదేవి గూర్చి ఆయనకీ తెలియదా? తెలుసు. మరెందుకిలా చేసాడు?

మానవధర్మాన్ని సుప్రతిష్ఠ చేయడానికి శ్రీరాముడు జన్మించాడు. తన ఆదర్శం యొక్క మూర్తిత్వాన్ని చూపించి లోకానికి మార్గదర్శనం చేయాలి. పురుషునికే కాదు నారీలోకానికి కూడా ధర్మమంటే ఇదీ అని ఆచరణీయాత్మకంగా తెలియజేయాలి. తాను స్నేహం చేసిన సుగ్రీవుడు అన్న వాలిచే బాధితుడు. అంతకు ముందే దుందుభి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి కొండ గుహలో ఉండిపోతే సుగ్రీవుడు కిష్కిందకు రాజౌతాడు. వాలి భార్య తార అప్పుడు సుగ్రీవునితో భోగాలనుభావిస్తుంది. తిరిగి వచ్చిన వాలి, సుగ్రీవుని తరిమేసి అతని భార్య రుమను చెచేరబడతాడు. అప్పుడు తార వాలిని చేరుతుంది. వాలి వధానంతరం తార మళ్ళీ సుగ్రీవునితో భోగాలనుభావిస్తుంది.

సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు లంకలో అంతఃపుర స్త్రీలు మద్యపానము చేసి, వావివరుసలు లేక, ఒళ్ళు తెలియని స్థితిలో నగ్నంగా ఒకరినొకరు కావలించుకుని పడుకొని ఉండడం చూస్తాడు. నాటి రాచ కుటుంబాలలో కాని, జనసామాన్యంలో కాని వావివరుసలు లేక భోగాలనుభావించడం సాధారణమైపోయింది.

మానవధర్మం అతి సహజంగా గతి తప్పింది. రావణవధానంతరంసీతాదేవిని తీసుకువస్తున్నప్పుడు అక్కడ శ్రీరాముని కోసం భూమి నాలుగు చెరగుల నుండి వచ్చిన వానరులున్నారు. లంకావాసులు కూడా ఉన్నారు. అమిత బల పరాక్రమవంతుడైన రావణాసురుని వధించిన మహాపురుషునిగా శ్రీరాముడు అక్కడ ఎదురుగా ఉన్నాడు. అప్పుడు, అక్కడ శ్రీరాముడు ఏది చేస్తే అది అందరూ ఆదర్శంగా స్వీకరిస్తారు. తమతమ ప్రాంతాలలో గొప్పగా చెప్పుకుంటారు. సీతాదేవిని మామూలుగా స్వీకరిస్తే తాము కూడా శ్రీరాముని వలె ఉచితానుచితాలు ఆలోచించకుండా జీవించవచ్చుననుకుంటారు. మరి అప్పుడు శ్రీరాముడు చేసింది రావణుని వధించడమే గాని ధర్మప్రతిష్ఠ అవుతుంది. పైగా సీతాదేవి విషయం లోకానికి తెలియదు. అందరి స్త్రీల వలెనే ఆమె కూడా అని అనుకోవచ్చు.

అందుకే శ్రీరాముడు అగ్నిపరీక్ష ద్వారా తానేమిటో, సీతాదేవి ఏమిటో లోకానికి తెలియజేసాడు. ధర్మాన్ని మానవ జీవన సమున్నత ఆదర్శంగా ఆచరణాత్మక సుప్రతిష్ఠ చేశాడు.

సత్యమనేది జ్వలించే అగ్ని. అందులో నిగ్గుతేలునదేదో అదే ధర్మము. అందుకే శ్రీరాముడు ధర్మమూర్తి. సీతామాత ధర్మస్వరూపిణి.

అందుకే రామాయణం ఇలా చెప్తుంది:

సత్యమేవే శ్వరో లోకే సత్యే ధర్మః ప్రతిష్ఠితః

సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం.

లోకమునందు సత్యమే దైవము.సత్యమందే ధర్మము ప్రతిష్ఠిత మై వుంది.జగత్తంతా సత్యమూలకమే.సత్యమును మించిన పరమ పదం యింకొకటి లేదు.

వాల్మీకం ప్రకారం సీతాదేవిని రాముడు అగ్ని ప్రవేశం చెయ్యమన లేదు.నీ యిష్టమైన చోటికి వెళ్ళు నీ ప్రవర్తన విషయం లో నాకు అనుమానం వుంది.అని మాత్రమే అన్నాడు. అలా అన్నది ఆమె మీద నమ్మకం లేక మాత్రం కాదు.లోక నిందకు భయపడి అన్నాడు.

తన ప్రాతివ్రత్యాన్ని నిరూపించుకునేందుకు ఆమె తానే అగ్ని ప్రవేశం చేసింది. తప్ప రాముడన్నది ఏమంటే “దీపో నేత్రాతురస్య ప్రతికూలాని సాదృశే” కంటిరోగం వచ్చినవాడు దీపాన్ని చూడలేనట్లు నిన్నునేను చూడలేకున్నాను.నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని. .వాల్మీకి హృదయం మాత్రం అందరికీ తెలిసిందే కంటి రోగం రాముడికే వున్నది ఆమె దీపం లాంటిదేనని.

(శ్రీ రాముడు సీతమ్మను అగ్ని ప్రవేశం చెయ్యమన్నాడని తర్వాత రామాయణం వ్రాసినవారు వ్రాశారు).

Previous articleవేలం పాట పేరిట వసూళ్లు
Next articleఆ ఫోన్ నెంబరు ఆంధ్రా లోని అన్ని రైల్వే స్టేషన్లో వ్రాయించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here