Home కళలు & సాహిత్యం తమిళనాడు లో తెలుగు పాటలా..!?

తమిళనాడు లో తెలుగు పాటలా..!?

41
0
నాకెప్పుడూ ఒక విషయంలో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.'కర్ణాటక సంగీతానిది ఏ భాష?' అని ఎవరైనా అడిగితే ఠక్కున చెప్పవలసిన సమాధానం-"తెలుగు" అని.

ఎందుకంటే..ఆనాటి తొలి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య మొదలుకొని రామదాసు, క్షేత్రయ్య ఇంకా సంగీత మూర్తిత్రయంలోని త్యాగయ్య,శ్యామశాస్త్రి, తమిళులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ముత్తయ్య భాగవతార్, కన్నడ దేశానికి చెందిన మైసూర్ వాసుదేవాచారి ఇత్యాది వాగ్గేయకారులు తెలుగు భాషనే ఎంచుకొని,తమ రచనలు చేశారు కనుక.

అయితే..నాకు ఆశ్చర్యం కలిగించేది..’కర్నాటక సంగీతం మాకు అర్థం కాదు’ అనేది కూడా అధికంగా తెలుగువారే!..మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలుగునాట సంగీతం నేర్చుకొని,పాడేవారు..ఆఖరికి వినేవారూ రోజురోజుకూ తగ్గిపోతున్నారు.

మిగతా అందరికీ అర్థమౌతున్న త్యాగయ్య కృతులు తెలుగువారికి మాత్రం ఎందుకు అర్థం కావు? ప్రపంచం అంతా ఆస్వాదించి,ఆరాధిస్తున్న కర్ణాటక సంగీతం పుట్టినింట మాత్రం ఎందుకు నిరాదరణకు గురి అవుతోంది?

దీనికి ఉన్న అనేక కారణాలలో ఒకటి-తెలుగువారి పరభాషా,నాగరికతా వ్యామోహం.దాన్ని విడిచిపెట్టి, తెలుసుకోవడం ప్రారంభిస్తే, కర్ణాటక సంగీత శ్రవణంలో ఉండే ఆనందం,సాహిత్యంతో లభించే మానసిక శాంతి మరే సంగీతంలోనూ ఉండదు.

మద్రాసు మ్యూజిక్ అకాడెమీ పేరు మీరు వినే ఉంటారు.మహమ్మదీయులకు మక్కా ఎలాంటిదో..సంగీత అభిమానులకు అది అలాంటిది.మొట్టమొదటిసారి 1978 వ సంవత్సరం డిశంబరులో మా గురువుగారు తీసుకువెళ్ళగా ఆ హాలులో నేను అడుగుపెట్టాను.అది భూలోక స్వర్గంలాఉంది.విశాలమైన వేదికపై విద్వాంసులెవరో పాడుతున్నారు…’బంటురీతి కొలువియ్యవయ్య రామా!’…అంటూ.

కీర్తన ప్రారంభం కాగానే హాలు నిండుగా ఉన్న జనం ఆనందంతో చేసిన హర్షధ్వానాలు విని, నేను ఒక్క క్షణం నివ్వెరపోయాను.మన తెలుగు కృతికి ఈ తమిళనాట ఇంత ఆదరణా?..నమ్మలేకపోయాను.చిత్రమేమిటంటే..రెండున్నర గంటలు సాగిన ఆ కచేరీలో దాదాపు అన్నీతెలుగు రచనలే వినబడ్డాయి.

అలా ప్రారంభమైన నా సంగీత శ్రవణం, మద్రాసులో ఏటా డిశంబరు నెలలో జరిగే సంగీతోత్సవాలకు వరుసగా 14 సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది.

విదేశాల నుండి కూడా ఎందరో వచ్చి అక్కడ సంగీతం వింటూ ఉంటారు.ఒకసారి అలా వచ్చిన ఒక ఆస్ట్రేలియాదేశ దంపతులను,మద్రాసు లోకల్ టీవీచానెల్ వారు,’మీరు కర్ణాటక సంగీతాన్ని ఎందుకు ఇష్టపడుతున్నార’ని అడిగారు.వారు చెప్పిన సమాధానం, శాస్త్రీయ సంగీతం వినని తెలుగువారికి గొడ్డలిపెట్టు వంటిది.

రైలు దిగింది మొదలు మద్రాసులో అప్పటిదాకా నాకు తమిళమే వినబడింది..ఒక్కసారిగా అక్కడ తెలుగు మాట వినబడేసరికి ప్రాణం లేచివచ్చినట్లయింది.అందులోనూ త్యాగయ్యగారి ఆ కీర్తన అంతకు ముందే గురువుగారి దగ్గర నేర్చుకున్నాను.

‘మేము సంగీతాభిమానులం..ఇద్దరం ప్రపంచంలోని వివిధ సంగీత రీతుల్ని తెలుసుకుంటూ అనేక దేశాలు తిరిగి, ఇండియాకి పదేళ్ళ క్రితం వచ్చాము.ఇక్కడ జరిగే సంగీతోత్సవాలకు హాజరయ్యాము.ఈ సంగీతం మొదట మాకు అర్థంకాలేదు.అయితే..ఏదో మహా అవ్యక్తానందం ఇందులో దాగి ఉన్నదనిపించింది.

మరుసటి సంవత్సరం కూడా వచ్చాము.రాగ,తాళాల గురించీ..సాహిత్యార్థాల గురించీ తెలుసుకుంటూ, వినడం ఆరంభించాము.మా ఆసక్తి మరింత అధికమయింది.అప్పటినుండీ ప్రతి సంవత్సరం విడువకుండా వస్తున్నాము..కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం.ఇప్పుడు మాకు,కర్ణాటక సంగీతం చాలావరకు అర్థమౌతుంది.

క్రమేపి ప్రపంచంలో కర్ణాటక సంగీతాన్ని మించినది లేదనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాము…మా ఇద్దరివీ చిరుద్యోగాలే…ఇప్పుడు మేమిద్దరం కష్టపడి,సంపాదించే ప్రతి డాలరూ దాచుకొని, ఇండియా వచ్చి,డిశంబరులో జరిగే ఈ సంగీతోత్సవాలు విని,ఆనందించడంకోసం ఖర్చు పెడుతున్నాం.నిజానికి, సంవత్సరమంతా దీనికోసమే మేం ఎదురుచూస్తూ ఉంటాం….’

సేకరణ : సుధాకర్ మోదుముడి ముఖపుస్తకం నుండి
Previous articleమీరు తెలుగు వారైతే..? 
Next articleఒక నది కోపంగా ఉండిపోయింది …!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here