Home స్పూర్తి పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలిపోయే పరిస్థితి..!

పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలిపోయే పరిస్థితి..!

39
0

జల భారత భాగ్యవిధాత, అపర భగీరథుడు, ఖాదీ ఇంజనీర్, పద్మభూషణ్ డా. కానూరి_లక్ష్మణరావు గారు

ఆ అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎడ్మిషన్ వచ్చింది. కానీ, ఇంజనీర్ కావాలని ఏ కోశానా లేదు. అదే చెప్పాడు వాళ్ల నాన్న గారికి. అయితే నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావని అడిగాడా తండ్రి. అన్నింటికంటే గొప్పదిగా పెద్దదిగా పేరుబడ్డ ఐఏఎస్ అని చెబితే ఇంజనీరింగ్ కోర్సు నుంచి తప్పుకోవచ్చులెమ్మని ఆ అబ్బాయి ఉపాయం; అదే చెప్తాడు ధీమాగా. అందుకు నవ్వి ఆ తండ్రి ఇలా అంటాడు:

“సృష్టికర్త బ్రహ్మకి సరిసాటి అయిన ఇంజనీర్ అయ్యే మహదవకాశాన్ని ఒక గ్లోరిఫైడ్ గుమస్తా గిరి కోసం వదులుకుంటావా?”

అదే కుర్రాడు ఇంజనీరింగ్ పట్టభద్రుడు అయ్యిన వార్త తెలిసిన వెంటనే, అభినందనగా అతడి నుదుటిని ముద్దాడి, “వెళ్లి అమ్మ దగ్గర వంట క్షుణ్ణంగా నేర్చుకోరా నాన్నా” అని చెప్పాడు అదే తండ్రి.

బిత్తరపోయిన ఆ బిడ్డని చూసి అమ్మ వంటి నవ్వుతో అన్నాడాయన: “ఇంజనీర్ గా నువ్వు ఏ కారడవుల్లోనో బ్రిడ్జ్ కట్టించాల్సి వస్తుంది. కాబట్టి, ఇంజనీర్ ఎప్పుడూ self-reliant గా ఉండాలి”.

****

ఆ తండ్రి జలమాంత్రికుడు, అపర భగీరథుడు, ‘ఖాదీ ఇంజనీర్’- కీ.శే. డా. కే.ఎల్.రావు. (కానూరి లక్ష్మణరావు), ఆ కుర్రాడు- తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రముఖ ఇంజనీర్ కానూరి అశోకరావు. self reliant… self-sufficient గా ఇంజనీర్ మాత్రమే కాదు, దేశం కూడా అన్నివిధాలా స్వయంసమృద్ధ, స్వావలంబిగా ఉండాలని ఆజన్మాంతం తపించారు కే ఎల్ రావు.

రెండో ప్రపంచయుద్ధం ముగింపునకు వస్తున్న రోజుల్లో పుట్టాడు అశోక్. అప్పట్లో ఇంగ్లాడులో ఉండేవారు కేఎల్ రావు. చంటిపిల్లల్ని సతీమణికి వదిలేసి ఆనకట్టల నిర్మాణం మీద పై చదువులకి అమెరికా వెళ్లిపోయారు కేఎల్ రావు. యుద్ధసమయం, సరైన సౌకర్యాలు లేవు, దేశం కాని దేశంలో అలా తనని ఒంటరిగా ఒదిలేసి వెళ్లవద్దని వేడుకుంది ఆ ఇల్లాలు. అప్పుడు ఆయన ఇలా చెప్పారు:

“ఆధునిక దేవాలయాలైన ఆనకట్టల నిర్మాణం గురించి నేర్చుకోవడానికి నేను అమెరికా వెళ్తున్నాను. రేపు మన దేశం పరపీడన నుంచి విముక్తమౌతుంది. అప్పుడు మన మహానదుల మీద ఆనకట్టలు మనమే కట్టుకోవాలి. కుటుంబం అనేది దేశం తర్వాతే నాకు అని తెలియదా?”

ఆశించినట్టుగానే నీటిపారుదల రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధగా చేశారు కేఎల్ రావు. స్వతంత్ర భారత్ ఆవిర్భవించి, జాతి ‘Tryst with Destiny’ యానం మొదలెట్టిన రోజుల్లో ఢిల్లీకి చేరారు కేఎల్ రావు. హీరాకుండి ఆనకట్ట డిజైన్ – అమెరికా ఇంజనీర్ల బృందం (Bureau of Reclamation, USA) సాయంతో మొదలయ్యింది. నీటిపారుదల రంగంలో కేఎల్ రావు శకం ప్రారంభమౌతున్న తొలిరోజుల్లోనే అమెరికా ఇంజనీర్లు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆపైన నిర్మితమైన గ్రావిటీ డ్యాములు (gravity dams) ఆర్చి డ్యాములు(arch dams), కాంక్రీట్ డ్యాములు (concrete dams), రాతి ఆనకట్టలు (masonry dams)… ఇంకా అండర్ గ్రౌండ్ విద్యుదుత్పాదక కేంద్రాలు…. అన్నీ రకాల పెద్ద… చిన్న నిర్మాణాలకి ఎటువంటి విదేశీ సహకారం లేకుండా రూపొందాయంటే అది కేఎల్ రావు ఘనతే. చంబల్ లోయలోని ఆనకట్టలు, మహానది మీద హిరాకుడ్, గంగానది మీద ఫరక్క బ్యారేజ్, తరచూ వరదలతో బీభత్సం సృష్టిస్తూ భార దుఃఖ నది (India’s River of Sarrow) గా పేరుబడ్డ దామోదర నదిపై కోసీ బ్యారేజ్, తపతీ నది మీద ఉకై, కర్ణాటకలో సర్వాధి ప్రాజెక్ట్, మేఘాలయలో ఉనియం, కృష్ణానది మీద శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టల నిర్మాణాల శిలాపలకాల మీద ఆ అపరభగీరథుడు- కేఎల్ రావు పేరే మెరుస్తుంటుంది.

మద్రాస్లో కూవం నదిపై ఉన్న పురాతన ఇనుప బ్రిడ్జి తుప్పు పట్టి కూలిపోయే పరిస్థితి వస్తే ,దాన్ని అలాగే ఉంచి కాంక్రీట్ తో పునర్నిర్మించి దేశాన్నీ ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సమర్ధులైన ఇంజనీర్ రావు గారు .అప్పటికి ప్రపంచంలో ఒక్క ఫ్రాన్స్ దేశం లో మాత్రమే కాంక్రీట్ కట్టడాలు నిర్మించేవారు. ఫ్రాన్స్ వెళ్ళకుండానే, ఆ కట్టడాలను చూడకుండానే తన అసాధారణ మేదస్సుతో కాంక్రీట్ వంతెన నిర్మించి ,రైల్వే చీఫ్ ఇంజనీర్ ప్రశంసలు అందుకున్న సమర్ధులు .ఈ బ్రిడ్జి నిర్మాణం అయ్యాకనే రావు గారు ఫ్రాన్స్ వెళ్లి ,ప్రసిద్ధ ఇంజనీర్ ఫ్రేన్సియనేట్ వద్ద శిక్షణ పొంది తన కౌశల్యానికి మెరుగులు దిద్దుకున్నారు. అక్కడి నుంచి లండన్ వెళ్లి కాంక్రీట్ ఇంజనీరింగ్ సంస్థలో చేరి పరిశోధనలు కొనసాగించారు .

ఐదు దశాబ్దాల నిర్విరామ సేవ ఫలితంగా, ఆయన ప్రమేయం లేని నది, విద్యుదుత్పాదక కేంద్రం, నీటిపారుదల రంగానికి చెందిన ఎటువంటి అంశం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. నదుల అనుసంధానం గురించి 50 ఏళ్ళ క్రితమే ప్రతిపాదించారు కేఎల్ రావు. గంగా – కావేరి అనుసంధానంతో పాటు, బ్రహ్మపుత్ర – గంగా అనుసంధానం గురించి వాదించి అధ్యయనాలు కూడా చేశారాయన. రావు గారి చిరకాల వాంచితం గంగా కావేరీ నదుల అనుసంధానం. అది కలగానే ఇంకా మిగిలి ఉండటం దురదృష్టం.

జనహిత ఇంజనీర్

‘దేశమంటే మట్టి కాదోయ్… దేశమంటే మనుషులోయ్ ‘ అన్న గురజాడ వారి స్ఫూర్తి అణువణువునా నింపుకున్న గొప్ప దేశభక్తుడు, జనహితం కోరే ఇంజనీర్ కేఎల్ రావు. నాగార్జున సాగర్ నిర్మాణం ఆయన ఇంజనీరింగ్ దక్షతకే కాదు, మహోన్నత మానవత్వ దృష్టికి చక్కని తార్కాణం. నదుల మీద రాతి కట్టడాలు కొత్త ఏమీ కాకపోయినప్పటికీ, అంత పెద్ద ఆనకట్ట మహానిర్మాణానికి రాతి కట్టాడాలను ఉపయోగించిన ఆయన నిర్ణయం మొదట విమర్శలను ఎదుర్కొందట. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఇది:

“అత్యంత పేదరికం తాండవిస్తోంది ఇక్కడ. నైపుణ్యం లేని పనివారికి పని కల్పించడం కనీస బాధ్యత. దానికితోడు ఇక్కడ అపారంగా దొరుకుతున్న రాతిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కూడా ఆర్థికంగా ఎంతో కలిసొస్తుంది”. అలా ప్రజల, దేశ సౌభాగ్యాన్ని కాంక్షించి, ఆ ఆలోచనకి తన సాంకేతికతని జోడించి ఆనకట్టల చరిత్రలోనే మహాద్భుతమని పేరు తెచ్చుకున్న నాగార్జున సాగర్ ని masonry dam గా నిర్మించారు కేఎల్ రావు.

భగవద్గీత, ఖురాన్ లతో పాటు రామకృష్ణ పరమహంస, వివేకానంద వారి రచనలతో ప్రభావితుడై, మహాత్మాగాంధీ గారి స్ఫూర్తితో నిరాడంబరుడుగా, వ్యసనాలకు దూరంగా ఉంటూ ‘ఖాదీ ఇంజనీర్’గా పిలవబడ్డారాయన.

ఏకాగ్రత… ఏకసంథాగ్రాహత…

కేఎల్ రావు కేంద్ర మంత్రిగా చేస్తున్న రోజుల్లో ఆయన కుమారుడు అశోక్ స్ట్రక్చురల్ సిద్ధాంతానికి సంబంధించిన సమస్య మీద మల్లగుల్లాలు పడటం చూసి, ఆ సమస్యని చిటికలో పరిష్కరించారట ఆయన. అప్పటికే పదేళ్ల నుంచి మంత్రిగా బాధ్యతల్లో తలమున్కలైనప్పటికీ, అంతకు ముందు ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం చదివిన పాఠాల్లోని ఫార్ములాని ఆయన గడగడా చెప్పేస్తుంటే, నోరెళ్లబెట్టి చూస్తుండిపోయానని అశోక్ రాసుకున్నారొక చోట.

అటువంటి అనుభవమే భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కి కూడా ఎదురయ్యిందట. Institution of Engineers అధ్యక్షుడిగా పనిచేసిన కేఎల్ రావు ఒక సమావేశంలో చేసిన అధ్యక్షోపన్యాసానికి ముగ్ధులైపోయారట ముఖ్య అథితి, అప్పటి ప్రధాని నెహ్రూ. 25 పేజీల సుదీర్ఘమైన ఆ ఉపన్యాసాన్ని కేఎల్ రావు అనర్గళంగా, ఆశువుగా మాట్లాడటం ఆయనకి అంశాల పట్ల అవగాహనకి, అంకితభావానికీ గుర్తని నెహ్రూ కొనియాడారట.

భారత దేశ భారీ స్థాయి జలవిద్యుత్ పధకాలను విస్తృతంగా ప్రభావితం చేసిన మేధావి ఇంజనీర్ సాంకేతిక నైపుణ్యం ఉన్న పరిశోధక పరబ్రహ్మ డా. రావు గారు. తన అనుభవం పరిశీలన పరిశోధన విస్తృత అధ్యయనాలతో 300 కు పైగా పరిశోధనా పత్రాను పరమ ప్రామాణికంగా రాశారు . రీ ఇన్ ఫోర్స్ డ్ కాంక్రీట్ పై రావు గారు రాసిన గ్రంధం ఉత్తమోత్తమ ప్రామాణిక గ్రంధంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఈ గ్రంధం అనేక దేశాలలో ఇంజనీరింగ్ విద్యార్ధులకు, పరిశోధకులకు పాఠ్య గ్రంధంగా ఉంది .’’జర్నల్ ఆఫ్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్’’ లో రావు గారు రాసిన ప్రామాణిక వ్యాసాలకు రాష్ట్రపతి చేతులమీదుగా మూడు సార్లు బంగారు పతకం పొందారు .

ఆజన్మాంత సేవ…

1902 జూలై 15న కంకిపాడు (విజయవాడ)లో పుట్టిన కేఎల్ రావు తొమ్మిదేళ్ల చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయారు. చిన్నతనంలో బడిలో ఆటలాడుతుండగా దెబ్బ తగిలి ఒక కంటి చూపు పోయింది. అన్నయ్యే తండ్రి స్థానం తీసుకొని తమ్ముడి ఆలనాపాలనా చూశాడు..తమ్ముడ్ని ఇంజనీరుగా చేయాలన్న సంకల్పంతో గణితం, వైద్యం, ఆనర్స్ లో సీట్లు వచ్చినా, అన్నగారు పట్టుబట్టి ఆయనని మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజిలో చేర్చారు. మద్రాసులో ఇంజనీరింగ్ పూర్తిచేసిన తర్వాత పీడబ్ల్యుడీ వర్క్‌షాప్‌లో ఒక సంవత్సరం శిక్షణ పొంది, విశాఖలోని డిస్ట్రిక్ట్ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీరుగా చేరారు కేఎల్ రావు. బర్మా వెళ్లాలని ప్రయత్నం విఫలమవటంతో, విజయనగరంలో అసిస్టెంటు ఇంజనీరు ఉద్యోగం చేశారు. తర్వాత ఇంగ్లండు వెళ్లి అప్రెంటిస్గా పనిచేస్తూ పరిశోధనల కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఎన్నో అవకాశాలు వచ్చినా, వాటిని కాలదన్ని మన దేశపు నిర్మాణ రంగ సవాళ్ళను ఆకర్షణీయంగా స్వీకరించి స్వదేశం తిరిగి వచ్చారు.

కేంద్రం జల విద్యుత్ కమిషన్ డిజైన్సు విభాగానికి డైరెక్టరుగా 1950లో నియమితులయ్యారు. 1954లో వరదలు అరికట్టే విభాగానికి చీఫ్ ఇంజనీరు అయ్యారు. 1956లో కేంద్ర జల విద్యుత్ కమిషన్ సభ్యుడయ్యారు. ఐక్యరాజ్యసమితి సహజ వనరుల కమిటీ అధ్యక్షులుగా, అంతర్జాతీయ నీటి పారుదల సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1957లో ఉద్యోగ పదవీ విరమణ చేసినా 1962 వరకు కేంద్ర జల కమిషన్ సభ్యులుగా కొనసాగారు.

ప్రజల మనిషిగా పేరొందిన కె.ఎల్.రావు సేవల్ని దేశానికి ఉపయోగించుకోవాలని నీలం సంజీవరెడ్డి కోరడంతో, 1962లో విజయవాడ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. 1967, 1971 ఎన్నికల్లో గెలిచిన కేఎల్ రావు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్ర్తీ, ఇందిరాగాంధీ మంత్రి వర్గాలలో పనిచేసి, దేశంలో ఎన్నో వ్యవసాయ, జల విద్యుత్ ప్రాజెక్టులకు జీవంపోశారు. 1963లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1968 మే 18న కన్నుమూశారు.

సేకరణ

Previous articleబ్రాహ్మణత్వం పుట్టుకతో వచ్చేది కాదు..!
Next article‘ఇందులో వింత ఏమీ లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here