Home కళలు & సాహిత్యం పంచతంత్రం అంటే?

పంచతంత్రం అంటే?

42
0

“ప్రపంచ నీతి కథలకు మాతృక పంచతంత్రం”

నీతికథలు జీవిత పాఠాలని నేర్పే మహత్తరమైన సాధనాలు. మనిషి నడవడిక ఎలా ఉండాలో ఇవి నేర్పుతాయి. అనేక సమస్యలకు నీతికథలలో పరిష్కారం దొరుకుతుంది. ఈ కథలలోని నీతిని మనకు అన్వయించుకుంటే స్థిరమైన సంకల్పంతో పాటు మనోబలాన్ని కూడా పొందుతాము.

మంచి నడవడికను గురించి, ధర్మా ధర్మాల గురించి, పిల్లలకు కూడా చక్కగా బోధిస్తాయి ఈ నీతి కథలు. ఇందులోని నీతి….. పిల్లల మనస్సులో బలంగా నాటుకుంటుంది.

భారతీయ సాహిత్యంలో అతి ప్రాచీనకాలం నుంచే నీతికథలు వాడుకలో ఉన్నాయి. భారత, భాగవత, రామాయణాలలోని అనేక కథలు, ఆఖ్యానాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. వాటన్నింటి సారభూతంగా వచ్చిన గ్రంథమే పంచతంత్రం. ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం.

మానవుడు అనుసరించవలసిన నీతిని బోధించడమే లక్ష్యంగా సాగే నీతి కథలన్నింటిలోకి ప్రధానంగా చెప్పుకోదగ్గది పంచతంత్రమ్. తంత్ర అనే శబ్దానికి నీతి లేదా ఉపాయము అని అర్థం. పంచతంత్రంలో నీతితో పాటు వినోదము కూడా ప్రధాన వస్తువు.

(అప్పాల శ్యాంప్రణీత్ శర్మ)

* పంచతంత్రం అంటే? *

పంచతంత్రం అంటే ఐదు ఉపాయాలు అని అర్థం.

1)మిత్రభేదం,

2) మిత్ర ప్రాప్తికం,

3) కాకోలూకీయం,

4) లబ్ద ప్రణాశం,

5) అపరీక్షిత కారకం

అనే ఐదుతంత్రాలు ఇందులో ఉన్నాయి. మొదటి నాలుగు భాగాలలో జంతువులు ప్రధాన పాత్రలు కాగా, ఐదవ దానిలో ప్రధాన పాత్రలు మనుషులు.

మన సాహిత్యంలోని ఈ నీతికథల సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇతర దేశాలలో కూడా అనేక నీతకథలు పుట్టుకొచ్చాయి. అటువంటి వాటిలో ‘అరేబియన్ నైట్స్’ వంటి కథలు బహుళ ప్రచారాన్ని పొందాయి.

* పలు భాషలలో పంచతంత్రం *

సుమారుగా రెండువేల సంవత్సరాలకి ముందే పర్షియా దేశ పండితుడైన బోర్జుయా అనే అతను ఈ పంచతంత్రాన్ని పహ్లావి భాషలోకి అనువదించాడు. ఆ తరువాత అది సిరియా, అరబ్బీ భాషలోకి తర్జుమా చెందింది. కాలాంతరంలో ఆ తర్వాత వచ్చిన అనువాదాలెన్నింటికో ఈ అరబ్బీ అనువాద గ్రంథమే ఆధారమయింది.

ఆధునిక యుగంలో పంచతంత్రానికి దాదాపుగా అన్ని భాషలలోనూ అనువాదాలున్నాయి. భారతీయ భాషలే గాక గ్రీకు, జర్మన్, ఇంగ్లీష్ , ఫ్రెంచ్ మొదలైన పలు విదేశీ భాషలలోకి ఇది అనువదించబడింది.

ప్రాంతాలనుబట్టి పంచతంత్రంలో పాఠ భేదాలున్నప్పటికీ ఆ భేదమంతా కథలలోని శ్లోకాలకు సంబంధించినదేగానీ…. మూల కథలలో పెద్దగా మార్పేమీ ఉండదు.

నేడు లభిస్తున్న పంచతంత్రమ్ దక్షిణాత్య పాఠమని “పద్మశ్రీ” డా.పుల్లెల శ్రీరామచంద్రుడు గారు అంటారు.

* రాసింది విష్ణుశర్మ *

ప్రస్తుతం విస్తృత ప్రచారంలో ఉన్న పంచతంత్రాన్ని విష్ణుశర్మ రచించాడని పండితుల అభిప్రాయం. ఇతను దక్షిణాపథంలోని మహిలారోప్యనగరానికి రాజైన అమరశక్తి కోరిక మేరకు ఈ గ్రంథం రచించి ఆయన కుమారులకు బోధించాడు. ఈ పాఠాలు విన్న ఆ రాకుమారులు విజ్ఞానవంతులయ్యారు.

పంచతంత్రాన్ని తెలుగులో పరవస్తు చిన్నయ సూరి గారు, కందుకూరి వీరేశలింగం పంతులుగారు సంగ్రహంగా వచన రూపంలో కొంత కొంత రాశారు.

ఆ తరువాత సంస్కృత భాషా ప్రచార సమితి వారు 1988లో మిత్రభేదం, మిత్ర ప్రాప్తికీయం అనే రెండు తంత్రాలతో దీనిని ముద్రించారు.

ప్రాచీన పురాణ ఇతిహాసాల నుంచి సేకరించిన ఉత్తమమైన నీతి శ్లోకాలతో చదివే వారికి ఆనందంతో పాటు నీతిని కూడా అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగే ఈ పంచతంత్రం ఈనాడు ప్రతి ఒక్కరు చదవవలసినది. ఒక కాలానికి, ప్రాంతానికి పరిమితం కాకుండా చిరకాలం నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం ఈ పంచతంత్రం.

రచన: అప్పాల శ్యాంప్రణీత్ శర్మ

Previous article‘ఇందులో వింత ఏమీ లేదు
Next articleఏ హిందువు నీచంగా దిగజారిపోడు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here